● వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్ వినియోగంపై అధికారుల పరిశీలన
అడ్డాకుల: రైతుల విజ్ఞప్తి మేరకు వ్యవసాయానికి అదనంగా రెండు గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అంగీకరించారు. శనివారం రాత్రి నుంచే అదనపు సరఫరా ప్రారంభించినట్లు ఏఈ రాములు తెలిపారు. అడ్డాకుల మండలంలోని కందూర్ శివారులో వ్యవసాయ బోరు మోటార్ల విద్యుత్ వినియోగాన్ని విద్యుత్‌శాఖ జిల్లా అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్‌ఈ భీమానాయక్, డీఈలు వేణుగోపాల్‌రెడ్డి, చంద్రమౌళి, ఏడీఈ చంద్రశేఖర్, ఏఈ రాములు బోర్ల నుంచి నీటిని తోడేందుకు పడుతున్న సమయం, విద్యుత్ వినియోగాన్ని అంచనా వేశారు. డ్రమ్ముల్లో నీటిని నింపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ భీమానాయక్ రైతులతో మాట్లాడి ప్రస్తుత విద్యుత్ సరఫరా సరిపోతుందా లేదా అని తెలుసుకున్నారు. మరో రెండు, మూడు వారాల్లో పంటలు చేతికందే అవకాశం ఉన్నందున వ్యవసాయానికి అదనంగా రెండు గంటల విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరారు. దీనికి అధికారులు అంగీకరించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ఎస్‌ఈ భీమానాయక్ సూచించారు. కార్యక్రమంలో ఎల్‌ఐ విజయ్, ఎల్‌ఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


