నల్లగొండ నేతలకు తలొగ్గిన సీఎం | - | Sakshi
Sakshi News home page

నల్లగొండ నేతలకు తలొగ్గిన సీఎం

Oct 25 2026 12:47 AM | Updated on Oct 25 2026 12:47 AM

● పాలమూరును ఎండబెట్టి డిండికి నీళ్లా?

● పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ జిల్లా చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి

జెడ్పీ సెంటర్‌ (మహబూబ్‌నగర్‌): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లను డిండి ప్రాజెక్టు పేరుతో నల్లగొండ జిల్లాకు తరలించే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఉమ్మడి పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ జిల్లా చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి అన్నారు. పాలమూరు ప్రయోజనాలను పక్కనపెట్టి నల్లగొండ నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి తలొగ్గారని ఆరోపించారు. శనివారం టీఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం, అదే జిల్లాకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. డిండి ప్రాజెక్టు నిర్ణయాన్ని పునఃపరిశీలించి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. నల్లగొండకు సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎదుల నుంచే నీటిని తరలించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ లేదా నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని తీసుకెళ్లే ప్రత్యామ్నాయాలపై ఎందుకు దృష్టి సారించడం లేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచే నీటిని తరలించాలని పట్టుబట్టడం వెనుక ఉద్దేశమేమిటని నిలదీశారు. పాలమూరుకు అన్యాయం జరుగుతున్నా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు మౌనంగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు స్పందించకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్లు బెక్కం జనార్దన్‌, రాఘవాచారి, హనీఫ్‌ అహ్మద్‌, లక్ష్మీకాంత్‌, చెన్నకిష్టన్న, ఖలీల్‌, లింగస్వామి, రఫిక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement