● రూ.7 కోట్ల ధాన్యం మాయం
● కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
మాగనూర్: మండలంలోని వడ్వాట్ గ్రామ పరిధిలోని శంకర్‌లింగ రైస్ మిల్‌పై గురువారం జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రైస్ మిల్లుపై ఆకస్మిక దాడులు నిర్వహించగా భారీ కుంభకోణం బయటపడింది. డీఎస్‌ఓ బాల్‌రాజ్, డీఎం సైదుల్ తెలిపిన వివరాలు ప్రకారం శంకర్‌లింగం రైస్ మిల్‌కు 2024 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సుమారుగా 76,000 వరి ధాన్యం బస్తాలను నిల్వ ఉంచుకునేందుకు కేటాయించారు. అదే విధంగా 2024–25 యాసంగి సీజన్‌కు సంబంధించి ప్యాడి 4972 బస్తాలు ఉండగా మొత్తం 80,972 బస్తాలను వారి యొక్క రైస్ మిల్లులో భద్రపరిచారు. ప్రస్తుతం ఒక్క బస్తా కూడా మిల్లులో లేకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. సదరు రైస్ మిల్లు యజమాని దండే తమ్మన్నపై స్థానిక పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ధాన్యం విలువ రూ.7.85 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అయితే గతంలో 2023 సంవత్సరం గాను వడ్వాట్ పరిధిలోని మల్లికార్జున రైస్ మిల్లు యజమాని దండే కృష్ణయ్య అవకతవలకు పాల్పడటంతో ఇక్కడ నిల్వ చేసిన ధాన్యాన్ని శంకర్‌లింగం రైస్ మిల్లు యజమానికి అప్పగించారు. దండే కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి రైస్‌మిల్‌ను సీజ్ చేశారు. మల్లికార్జున రైస్‌మిల్లులో ఉన్న ధాన్యాన్ని శంకర్‌లింగం మిల్లు యజమానికి అప్పగించారు. ఈ ధాన్యాన్ని దండే తమ్మన్న మాయం చేయడంతో అతనిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నాగరాజ్, డీఎం సైదుల్, డీఎస్‌ఓ బాల్‌రాజ్, మాగనూర్ పోలీసులు ఉన్నారు.


