కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు శివారులో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టు నుంచి నాలుగు రోజులుగా రెండు పంపుల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ఆదివారం నాటికి నార్లాపూర్ రిజర్వాయర్లోకి రెండు మోటార్ల నుంచి 1.7 టీఎంసీల నీటిని ఎత్తి పోసినట్లు ప్రాజెక్టు ఈఈ లోకిలాల్ తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు రెండు మోటార్లు కలిపి 180 గంటలు నడిచినట్లు ఆయన తెలిపారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి 2.5 టీఎంసీ నీటిని తోడినట్లు వెల్లడించారు. నార్లాపూర్ రిజర్వాయర్లో ప్రస్తుతం ఉన్న నీటితో కలిసి 6.5 టీఎంసీ నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించడానికి ఈ నీటిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
కేఎల్ఐ డీ–5 కాల్వకు గండి
కొల్లాపూర్: మండలంలోని నార్లాపూర్ గ్రామ సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని డీ–5 కాల్వకు గండిపడింది. కాల్వ కొంతభాగం పాలమూరు ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్లో మునిగిపోయింది. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్ కే ఈ కాల్వను అనుసంధానం చేశారు. దీంతో కాల్వలోకి నీళ్లు వదిలేందుకు తూమును ఏర్పాటుచేశారు. మూడు రోజులుగా పాలమూరు ప్రాజెక్టు ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తుండడంతో రిజర్వాయర్ దాదాపుగా నిండుకునే పరిస్థితికి వచ్చింది. దీంతో తూము వద్ద నీటి ప్రవాహ ఉధృతి పెరిగి కాల్వకు గండి పడి ఉంటుందని అధి కారులు భావిస్తున్నారు. వెంటనే మరమ్మతు చేపడతామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.


