● పది రోజుల్లో పూర్తిగా దర్శనమిచ్చేఅవకాశం
కొల్లాపూర్ రూరల్: కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో మునిగిన సంగమేశ్వరాలయం క్రమంగా బయటపడుతోంది. శనివారం శ్రీశైలం నీటిమట్టం 845 అడుగులకు చేరడంతో ఆలయం దాదాపు సగభాగం నీటి పైకి కనిపిస్తోంది. గత వారం రోజులుగా నదిలో నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ఈ సమయంలో నదిలో నీటిమట్టం ఇంతగా తగ్గడం చాలా అరుదని సంగమేశ్వరాలయం ప్రధాన అర్చకుడు రఘురాం శర్మ తెలిపారు. నాలుగు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే, శ్రీశైలానికి నీటి లభ్యత తీవ్రంగా తగ్గిన సంవత్సరాల జాబితాలో 2026 కూడా చేరిందని పేర్కొన్నారు. ఈ ఏడాది శ్రీశైలానికి ఆశించిన స్థాయిలో వరద నీరు రాకపోవడంతోనే ఆలయం బయటపడుతోందని వివరించారు. ఇదేవిధంగా నీటిమట్టం తగ్గుతూ ఉంటే మరో పది రోజుల్లో ఆలయం పూర్తిగా బయటపడే అవకాశం ఉందని, తద్వారా భక్తులకు సంగమేశ్వరుడిని దర్శించుకునే భాగ్యం కలగవచ్చని తెలిపారు.


