అచ్చంపేట రూరల్: అచ్చంపేట ఎస్‌టీఓ (సబ్ ట్రెజరీ) కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళ వారం తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్(ఏఓ)గా పనిచేస్తున్న వెంకటయ్యపై అవినీతి ఆరోపణలు రావడం, ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేశారు. లంచం డిమాండ్ చే సి స్వీకరించిన ట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు ఆధారాలతో కార్యాలయంలో వెంకటయ్యను విచారించారు. లంచం డబ్బును తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
అసలేం జరిగిందంటే..
ఓ ఉద్యోగి, ఫిర్యాదుదారుడు వైద్య సెలవు, సంబంధిత బిల్లులను ప్రాసెస్ చేయాలని ఏఓ వెంకటయ్యను సంప్రదించాడు. అందుకుగానూ రూ.25 వేలు ఏఓ డిమాండ్ చేయగా.. ఆగస్టు 14న రూ.3 వేలు నగదు చెల్లించాడు. అదే నెలలో 18న ఫోన్ పే ద్వారా మిగిలిన రూ.22వేలు ఫిర్యాదుదారుడు వెంకటయ్యకు చెల్లించాడు. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయడంతో మంగళవారం పూర్తి ఆధారాలతో వెంకటయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటయ్యను హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండుకు తరలిస్తామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు అధికారి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని, అలాగే వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.


