● రూ.300 కోట్ల విలువైన భూములపై రియల్టర్ల కన్ను
● తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
లక్డీకాపూల్: రూ.300 కోట్ల విలువైన ఎంబీ చర్చి భూములను కబ్జా చేసేందుకు కొందరు రియల్టర్లు కుట్ర చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆరోపించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎంబీ చర్చి, జడ్చర్ల భూముల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ కలెక్టర్ జాన్ వెస్లీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1974లో గవర్నర్ కౌన్సిల్ అనుమతితో క్రిస్టియన్ మిషనరీ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా ఏర్పాటైన ఎంబీ చర్చి ద్వారా వైద్య సేవలు కొనసాగాయని తెలిపారు. జడ్చర్ల మండలం గౌరారం గ్రామంలోని సుమారు 57 ఎకరాల భూమిలో చర్చి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వందేళ్లుగా ఈ భూమి చర్చి యాజమాన్యంలోనే ఉందని, వందలాది మంది దళిత క్రైస్తవులకు దీనితో అనుబంధం ఉందన్నారు. ఎలాంటి అధికారిక పత్రాలు చూపకుండా కొందరు ప్రైవేట్ వ్యక్తులు భూమిలోకి ప్రవేశించి నిర్మాణాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. భూ భారతి రికార్డుల్లో చర్చి పేరుతో భూమి ఉన్నప్పటికీ పోలీసులు ప్రైవేట్ వ్యక్తులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యాజమాన్యంపై స్పష్టత కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. భూమి యాజమాన్యాన్ని నిర్ణయించడం రెవెన్యూ శాఖ, న్యాయస్థానాల పరిధిలోని అంశమని, పోలీసులు రెవెన్యూ అధికారుల్లా వ్యవహరించడం సరికాదన్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తికాకుండా మెడికల్ కాలేజీ పేరుతో చర్చి నిర్మాణాలను కూల్చివేయడం తగదన్నారు. డా.అనురాధ నివాసాన్ని కూల్చివేసిన ఘటనపైనా ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఎంబీ చర్చి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


