మన్ననూర్: కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ఎన్ని మారుతున్నా ఆదివాసి చెంచుల బతుకులు మాత్రం అక్కడే ఆగిపోయాయని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మహిపతి అరుణ్‌కుమార్ అన్నారు. బుధవారం చెంచుల కనీస సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆదివాసి ఐక్యవేదిక, తుడుందెబ్బ ఆధ్వర్యంలో మన్ననూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలోని 29 శాఖల్లో 29 ప్రత్యేక జీఓలు ఉన్నప్పటికీ నూతన జోనల్ విధానంతో ఆదివాసీ హక్కులను మైదాన ప్రాంతం వారు దోచుకుపోతున్నారని వాపోయారు.
వైల్డ్ లైఫ్ యాక్ట్‌తో..
అటవీశాఖ కొత్తగా వైల్డ్ లైఫ్ యాకు్‌ట్ తీసుకొచ్చి తమ హక్కులను కాలరాస్తూ కనీస స్వేచ్ఛకు దూరం చేస్తున్నారని వాపోయారు. అటవీశాఖ చట్టాలను నిలువరించి చెంచుల కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పీఓ, కలెక్టర్‌తో పాటు ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి 5వ షెడ్యూల్, అటవీహక్కులు, పెసా చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో నివాసం ఉంటున్న వారికి తాగు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, పక్కా ఇళ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో కొమరంభీమ్ తరహాలో గోండులు, కోయలు, పర్దాన్, ఆదివాసి, కొండరెడ్లు తదితర 9 తెగలకు చెందిన లక్ష మంది ఆదివాసీలతో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు ప్రధాన కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. చెంచుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ఏఓ జాఫర్‌హుసేన్‌కు అందజేశారు. కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాసులు, జాతీయ అధ్యక్షుడు విజయ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి, మల్లికార్జున్, బాబురావు, బాల గురువయ్య, నిమ్మల శివ తదితరులు పాల్గొన్నారు.


