మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఏ–1 (సమ్మేటివ్ అసెస్‌మెంట్) పరీక్షలు నేటి నుంచి(గురువారం) ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా పరీక్షల జవాబు పత్రాలను మండల విద్యావనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) మూల్యాంకనం చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రశ్నాపత్రాలను ఎమ్మార్సీల నుంచే పంపించనున్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం జవాబు పత్రాలను తిరిగి ఎమ్మార్సీలకు తరలించి మూల్యాంకనం చేపడతారు. ప్రాథమిక స్థాయి జవాబు పత్రానికి రూ.2, హైస్కూల్ స్థాయికి రూ.3 చొప్పున పారితోషికం చెల్లించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,200 ప్రభుత్వ పాఠశాలల్లో 1.80 లక్షల మంది, 1,230 ప్రైవేటు పాఠశాలల్లో 1.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా 2.90 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. మూల్యాంకనం అనంతరం మార్కులను నమోదు చేసి, ప్రక్రియను అధికారులు పర్యవేక్షించనున్నారు. కాగా.. దీనిపై ఉపాధ్యాయసంఘాల నుంచి కొంత వ్యతిరేకత రావడంతో బుధవారం రాత్రి మూల్యాంకనానికి సంబంధించిన నిబంధనలు మార్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తొమ్మిదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఆరో తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన కూడా ఎమ్మార్సీలో మూల్యాంకనం చేయాల్సి ఉన్నా.. కేవలం తొమ్మిది జిల్లాలను మాత్రమే ఎంపిక చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యా మరియు సమగ్ర శిక్షా డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలకు మినహాయింపు ఇచ్చారు.
ప్రైవేటు బడుల్లో అనుమానాలు
ప్రైవేటు పాఠశాలల్లో అధిక శాతం యాజమాన్యాలు ప్రభుత్వ సిలబస్‌కు అనుగుణంగా బోధన సాగించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సొంత సిలబస్, పుస్తకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కొన్ని పాఠశాలల్లో ప్రశ్నాపత్రాలను ముందుగానే విద్యార్థులకు ఇచ్చి జవాబులు రాసుకుని రావాలని సూచించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొత్త మూల్యాంకన విధానంతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా అనే చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలు
సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలకు తొలిసారిగా జవాబు పత్రాల మూల్యాంకన విధానాన్ని అమలు చేస్తున్నాం. పరీక్షలు పూర్తయ్యాక తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థుల జవాబు పత్రాలను ఎమ్మార్సీలకు తరలించి అక్కడే మూల్యాంకనం చేపడతాం. ప్రభుత్వం పంపించిన ప్రశ్నాపత్రాల ఆధారంగానే పాఠశాలలు పరీక్షలు నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.
– విజయకుమారి,
డీఈఓ, మహబూబ్‌నగర్
తొలిసారి ఎమ్మార్సీల్లో 9వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం
ప్రక్రియను పరిశీలించనున్న అధికారులు.. మార్కుల నమోదు
ప్రభుత్వ సిలబస్‌ను పట్టించుకోని ప్రైవేటు యాజమాన్యాలు


