జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జాతీయ రహదారులపై పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ డి.జానకితో కలిసి జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్ సేఫ్టీ చర్యలు చేపట్టాలని, రోడ్లు, అప్రోచ్ రోడ్లు, లైటింగ్, సైన్‌బోర్డుల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. బాలానగర్ వద్ద జాతీయ రహదారి పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజాపూర్, పోలేపల్లి సెజ్ ప్రాంతాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంబటిపల్లి–దివిటిపల్లి, పాలకొండ బైపాస్‌ల వద్ద లైటింగ్ పను లు, విద్యుత్ కనెక్షన్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జడ్చర్ల–కల్వకుర్తి రహదారితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు గుర్తించి అమలు చేయాలని, గడువులో పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
డీఆర్ ఫణిధర్ బదిలీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (డీఆర్) డి.ఫణిధర్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇటీవల గ్రూప్ వన్‌లో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న పి.దీపక్‌ను నియమించారు. ఈయన త్వరలోనే మహబూబ్‌నగర్‌కు వచ్చి విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రేపు ఫుట్‌బాల్
క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: త్వరలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల, మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ జట్ల ఎంపికలను ఈనెల 2వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తునట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్, కాన్సెంట్ ఫామ్, పాస్‌పోర్టు ఫొటోలతో హాజరుకావాలని కోరారు. మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనాలని సూచించారు. వివరాల కోసం 9396439663 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
రేపు ‘కరాటే’ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శుక్రజువారం ఎస్‌జీఎఫ్ అండర్–14, 17 విభాగాల జిల్లాస్థాయి బాలబాలికల కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులు ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, కరాటే యూనిఫామ్‌తో ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. వివరాలకు శంకర్‌నాయక్ (98493 36930)ను సంప్రదించాలని సూచించారు.


