సమాజసేవలో ఆత్మీయ మిత్రమండలి | - | Sakshi
Sakshi News home page

సమాజసేవలో ఆత్మీయ మిత్రమండలి

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

ఆరు పదులు దాటిన వయసులోనూ ఆత్మీయ అనుబంధంతో సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు జడ్చర్లకు చెందిన పెద్దలు. వివిధ రంగాల్లో స్థిరపడిన 40 మంది కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ మిత్రమండలి పలు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్‌ బి.శివకుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మండలి ఇప్పటికే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించింది.

87 కుటుంబాలకు అన్నదానం

జడ్చర్లలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ‘అంతిమ ఆరాధన’ పేరుతో అదే రోజు అన్నదానం చేస్తున్నారు. సాధారణంగా మృతుల ఇళ్లలో వంట చేయని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, బంధువులకు ఇబ్బంది లేకుండా అన్నదానం అందిస్తున్నారు. ఇప్పటివరకు 87 కుటుంబాలకు ఈ సేవ అందించారు.

ప్రవచనాలు.. అష్టావధానం

ప్రముఖ ప్రవచనకారులతో కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు అష్టావధానం, వేమన పద్యాలు, భగవద్గీత శ్లోకాల పఠనం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. మండలిలో 40 మంది సభ్యులు ఉండగా పలువురు దాతలు సహకరిస్తున్నారు.

● విప్లవ వీరుడు పండుగ సాయన్న జీవితంపై నాటక ప్రదర్శనకు మండలి కసరత్తు చేస్తోంది. అక్టోబర్‌ 22న సాయన్న జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కళాకారులే పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement