‘నవోదయ’ సమగ్రాభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

‘నవోదయ’ సమగ్రాభివృద్ధికి చర్యలు

Sep 30 2026 1:04 AM | Updated on Sep 30 2026 1:04 AM

కందనూలు: జిల్లాలోని వట్టెం జవహర్‌ నవోదయ విద్యాలయం సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జవహర్‌ నవోదయ పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పీఎంశ్రీ కింద చేపడుతున్న పనులు, నిధుల వినియోగం తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్‌ పూర్ణిమతో తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, వివిధ నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలన్నారు. పీఎంశ్రీ నిధులతో విద్యార్థులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ.. పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. విద్యార్థులకు చదువుతో పాటు సంగీతం, కళలు, క్రీడలు తదితర రంగాల్లోనూ నైపుణ్యాలను పెంపొందించే అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రదేశాలను నవోదయ విద్యార్థులు సందర్శించేలా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థుల అభ్యాసానికి సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పాఠశాలకు 20 కంప్యూటర్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 11, 12వ తరగతి విద్యార్థులకు ఐఐటీ ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక బోధనా కార్యాచరణ రూపొందించి, అమలుచేయాలని ఆయన సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి 6, 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం కొనసాగుతున్న నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. సమావేశంలో డీఈఓ రమేశ్‌కుమార్‌, పాఠశాల సీనియర్‌ ఉపాధ్యాయుడు బాలాజీ నాయక్‌, డీఈ శిరీష్‌, డా.సృజన ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement