జడ్చర్ల టౌన్: పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ భూములు, గాంధీ ట్రస్టు భూమిపై మంగళవారం లోకాయుక్త అధికారి విచారణ జరిపారు. సామాజిక వేత్త అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ అధికారి కోటేశ్వరరావు, మరో అధికారి వెంకటరమణమూర్తి ముందుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే తహసీల్దార్ నర్సింగ్‌రావు, ఫిర్యాదుదారు అనిల్‌కుమార్‌తో ఆలయ భూముల వివరాలు తెలుసుకుని భూములను పరిశీలించారు. ఆలయానికి భూములు ఎవరు కేటాయించారు.. ఎలా వచ్చాయని అడిగారు. ఎప్పటినుంచి దేవుని మాన్యంగా ఉండిందని, ఎలా విక్రయాలు జరిగాయని విచారించారు. దేవుని భూములకు సంబంధించి ఎందుకు ఫెన్సింగ్ చేయలేదని ప్రశ్నించారు. అనంతరం గాంధీ ట్రస్టు స్థలానికి చేరుకుని అక్కడి స్థానికులతోనూ మాట్లాడారు. ట్రస్టుకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల విషయంలో వచ్చిన ఫిర్యాదులను విచారించేందుకు వచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేసి ఆయా శాఖలకు పంపిస్తామన్నారు. తర్వాత భూత్పూర్ మండలం తాటిపర్తిలోనూ ఆయన పర్యటించారు. అక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయ భూములను విక్రయించారని ఫిర్యాదుదారు వివరించారు. కాగా, దేవదాయశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోరని, అందుకే ఇన్నాళ్లుగా వివాదం నడుస్తున్నప్పటికీ ఆలయం ఎదుటనే నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. కొన్ని నిర్మాణాలను ఆయనకు చూయించారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ నర్సింగ్‌రావు, సర్వేయర్, ఆర్‌ఐలతోపాటు దేవదాయశాఖ అధికారి శంకుతల ఉన్నారు. లోకాయుక్త అధికారి విచారణకు వచ్చిన గంట తర్వాత దేవదాయ శాఖ అధికారి అక్కడికి చేరుకున్నారు. తాను కొత్తగా వచ్చానని, వివరాలు ఏం తెలియవని లోకాయుక్త అధికారికి తెలియజేశారు.


