కందనూలు: డైమండ్ రింగ్ పంపిస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ రాగా బాధితురాలు రూ.74,500 చెల్లించి, మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నాగర్‌కర్నూల్ మండలంలోని చందుబట్ల గ్రామానికి చెందిన ఓ మహిళకు ఈ నెల 26న ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ఫోన్ లిప్టు చేసిన ఆమెకు మీ కొడుకు బర్త్‌డే కు డైమండ్ రింగ్ పంపిస్తామని అజ్ఞాత వ్యక్తి చెప్పారు. వాట్సాప్‌లో స్కానర్ పంపిస్తాను రూ.74,500 చెల్లించండి సూచించాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు వెంటనే స్కానర్‌కు డబ్బులు పంపించారు. ఆ తర్వాత తన భర్తకు కాల్ చేసి విషయం చెప్పడంతో మోసపోయామని గుర్తించిన ఆయన వెంటనే 1930 కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈనెల 28న నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా.. సైబర్ మోసం జరిగిన ఘటన వాస్తవమే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
పాముకాటుతో
మహిళా కూలీ మృతి
అయిజ: పాముకాటుకు మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. పులికల్ గ్రామానికి చెందిన అంజనమ్మ (45) మండలంలోని ఉత్తనూరు శివారులో పత్తి ఏరేందుకు తోటి కూలీలతో కలిసి వెళ్లింది. పత్తి తీస్తుండగా అంజనమ్మ కాలుకు పాము కాటు వేసింది. తోటి కూలీలు బాధితురాలిని వెంటనే అయిజలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతురాలి కుమార్తె అనూష ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గురుస్వామి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


