ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రధానంగా సాగు, తాగు నీటి కోసం ప్రియదర్శిని జూరాల, మహాత్మాగాంధీ కల్వకుర్తి, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, నెట్టెంపాడు, భీమా–1, 2, కోయిల్‌సాగర్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఎత్తిపోతల పథకాలే కాగా.. తుమ్మిళ్ల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్మాణానికి నోచుకున్నాయి. తుంగభద్ర పరివాహకంలోని ఆర్డీఎస్, కృష్ణా నదిపై నిర్మించిన జూరాల మినహాయిస్తే.. ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో నిర్దేశించిన సాగు లక్ష్యం మేర ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు.
రిజర్వాయర్లే అసలు సమస్య..
పాలమూరులో కృష్ణానది నుంచి నీటిని తోడి పంప్‌ల ద్వారా సరఫరా చేయాల్సిందే. నీరు నిల్వ చేసేలా భారీ రిజర్వాయర్లు నిర్మించకపోవడమే ఇందుకు కారణం. అయితే ఎంజీకేఎల్‌ఐలో నాలుగు రిజర్వాయర్లు (ఎల్లూరు 0.35 టీఎంసీలు, సింగోటం 0.55 టీఎంసీలు, జొన్నలబొగుడ 2.14 టీఎంసీలు, గుడిపల్లిగట్టు 0.96 టీఎంసీలు) నిర్మించారు. మొత్తంగా నీటి నిల్వ సామర్థ్యం నాలుగు టీఎంసీలే. కృష్ణా నదికి సాధారణంగా వరదలు వచ్చే 60 రోజుల్లో 40 టీఎంసీలను ఎత్తిపోయాలి. రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో అదనంగా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తలచింది. వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గంలో 20 ఆన్‌లైన్ చెరువులను రిజర్వాయర్లుగా (మొత్తంగా 9.95 టీఎంల సామర్థ్యం) మార్చాలని ప్రణాళిక రూపొందించగా.. రెండింటికే అనుమతులు ఇచ్చింది. రూ.87 కోట్ల వ్యయంతో బుద్ధారం, గణపసముద్రం చెరువుల పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్డీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రూపకల్పన చేసిన తుమ్మిళ్లలో రిజర్వాయర్ల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
....జూరాల ఆయకట్టు పరిధిలో రైతుల నీటి పోరు సందర్భంగా ప్రధాన రాజకీయ పక్షాల నేతల వ్యాఖ్యలు ఇవి. ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చి నీరు విడుదల చేయగా.. ఆందోళనలు సద్దుమణిగాయి. అయితే పాలమూరులో దశాబ్దాలుగా తీరని నీటి ఆకాంక్షలపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఆయా పార్టీల ముఖ్య నాయకులు ఎవరికి వారు తమ వాదన వినిపిస్తుండగా.. రైతుల్లో ఆవేదనతో పాటు ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ఉమ్మడి ఏపీ,ఆ తర్వాత కొట్లాడి పాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ పెండింగ్ ప్రాజెక్ట్‌లకు వీడని గ్రహణం, పూర్తి స్థాయిలో ఆయకట్టుకు అందని సాగునీరు వెరసి రైతుల దీనగాధపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
పూడిక, మరమ్మతు సమస్య..
ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా నిలుస్తున్న జూరాల ప్రాజెక్ట్‌ను పూడిక సమస్య తీరడం లేదు. ప్రాజెక్ట్ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా.. 2.30 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయినట్లు 2012 లోనే తేల్చారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లో గెండెకాయ వంటి ర్యాలంపాడు జలాశయంలో రాక్‌టోలు, తూములు, ఆనకట్ట బండ్‌లో లీకేజీలు ఏర్పడడంతో నాలుగు టీఎంసీలకు రెండు టీఎంసీల నీటినే నింపుతున్నారు. మూడేళ్లుగా ఈ పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అదేవిధంగా ఎంజీకేఎల్‌ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్‌ల పరిధిలో మోటార్లలో సాంకేతిక సమస్యలు తెత్తతడం.. మరమ్మతుల్లో నిర్లక్ష్యం తదితర కారణాలతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
10 లక్షలకు 6 లక్షల ఎకరాలే..
వలసల జిల్లా పాలమూరులో బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ఉమ్మడి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఇతర చిన్న ఎత్తిపోతల నిర్మాణాలు చేపట్టారు. వీటి ద్వారా సుమారు 10 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనేది లక్ష్యం. ఆయన అకాల మరణానంతరం పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల్లో కొంత మేర ప్రగతి సాధించినా.. దీంతో పాటు మిగతా ప్రాజెక్టుల్లో చివరలో సుమారు 10 శాతం మేర పెండింగ్‌లో ఉన్న పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ఫలితంగా ఆరు లక్షల ఎకరాలకే సాగు నీరందే పరిస్థితి ఉంది.
ప్రాజెక్ట్‌ల వారీగా ఇలా (ఎత్తిపోతలు జరిగితే)..
ప్రాజెక్ట్ సాగు నీరందించే పారుతోంది.. పెండింగ్
లక్ష్యం (ఎకరాల్లో) (ఎకరాల్లో) (ఎకరాల్లో)
ఎంజీకేఎల్‌ఐ 4,20,000 2,00,000 2,20,000
నెట్టెంపాడు 2,00,000 1,42,000 58,000
భీమా 1,11,000 91,000 20,000
కోయిల్‌సాగర్ 50,250 36,000 14,250


