● అక్టోబర్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
● కలెక్టర్ ఖుష్బూగుప్తా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వానాకాలం 2026–27 సీజన్‌లో ధాన్యం సేకరణను పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 4.26 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా, అందులో 1.53 లక్షల టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 163 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అక్టోబర్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, తూకం, తేమ పరీక్ష పరికరాలు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కేంద్రాలను ముంపునకు అవకాశం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే సౌకర్యం, విద్యుత్ కల్పించాలన్నారు. సన్న, దొడ్డు రకాలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర కాగా, ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాలకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ధాన్యంలో తేమ 17 శాతానికి మించకూడదని సూచించారు. కొనుగోలు వివరాలను అదే రోజు ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలని, రైతులకు మద్దతు ధర సొమ్ము 48 గంటల్లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని శుభ్రపరిచి, ఎండబెట్టి, వ్యవసాయ శాఖ టోకెన్ ప్రకారం నిర్ణయించిన తేదీన కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. అలాగే యాసంగి 2025–26 ధాన్యం కొనుగోలు కమిషన్‌కు సంబంధించిన రూ.2.61 కోట్లను బుధవారం సాయంత్రంలోగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ఖాతాల్లో జమ చేయాలని డీఆర్‌డీఓ, సహకార శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, ట్రైనీ కలెక్టర్ సాయి శివాని, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.


