● ‘చేయూత’ దరఖాస్తుల
పరిశీలనలో జాప్యం
● నేడే ఆఖరు.. ఇంకా పెండింగ్‌లో 4వేలకు పైగా దరఖాస్తులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ‘చేయూత’ పథకం కింద కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈనెల 15 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. అయితే జిల్లాలో వెరిఫికేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో గడువులోగా పూర్తవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 16 మండలాలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. వివిధ రకాల పెన్షన్ల కోసం మొత్తం 15,570 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 25లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ పూర్తయినవి సైతం వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం గడువును 30 వరకు పెంచింది. ఇప్పటివరకు 10,619 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తికాగా.. 4,066 పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం కాలేదు.
● అధికారులు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారుల వివరాలను సేకరిస్తున్నారు. ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అనంతరం వివరాలను మండల అధికారులకు పంపిస్తున్నారు. అక్కడ ఎంపీడీఓలు తమ లాగిన్‌లో పరిశీలించి అర్హతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంతో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి.


