మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ జూనియర్ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.95 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యనందిస్తున్న కళాశాలను అన్ని వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. నూతన భవనాల నిర్మాణానికి త్వరలో భూమిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కళాశాల ప్రాంగణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. ఆధునిక ల్యాబొరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కళాశాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.


