జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. హక్కులు, చట్టాలపై అవగాహన ఉంటే ఇతరుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తపడటంతో పాటు, సమస్యలు ఎదురైనప్పుడు సరైన అధికారులను ఆశ్రయించి న్యాయం పొందవచ్చన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ డే కేర్ సెంటర్‌లో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల తెలియక తప్పులు చేసే అవకాశం ఉంటుందని, చట్ట పరిజ్ఞానం ఉంటే న్యాయపరమైన చిక్కులను తగ్గించుకోవచ్చన్నారు. సమాజంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడానికి చట్టంపై అవగాహన దోహదపడుతుందని పేర్కొన్నారు. రాజీ పడదగిన కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీకి అవకాశం లేని కేసుల్లో పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సునిత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ నరేష్ చంద్ర, పారాలీగల్ వలంటీర్లు ఎ.రాజసింహుడు, నస్కంటి నాగభూషణం, కోటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


