● విద్యార్థులకు పరిశోధన, శిక్షణలో మరిన్ని అవకాశాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)తో పాలమూరు యూనివర్సిటీ (పీయూ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పీయూ విద్యార్థులకు పరిశోధనా ప్రాజెక్టులు, శిక్షణా కార్యక్రమాలు, ఆధునిక ప్రయోగశాలల పరిజ్ఞానం, సంయుక్త పరిశోధనల్లో పాల్గొనే అవకాశాలు లభించనున్నాయి. జాతీయ స్థాయి పరిశోధనా సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు పరిశోధన రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వీసీ శ్రీనివాస్ తెలిపారు. యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా నూతన పరిశోధనలకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీయూ పరిశోధక విద్యార్థులు, ప్రాజెక్టు అసిస్టెంట్లు, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విద్యా ర్థులు సీఎస్‌ఐఆర్–ఐఐసీటీని సందర్శించారు. అధ్యాపకులు చంద్రకిరణ్, నూర్జహాన్, విజయలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


