ఇంటి వద్దే సర్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దే సర్‌ విచారణ

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

అచ్చంపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలను తీర్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నోటీసులు అందుకున్న వారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సూచించింది. అన్‌మ్యాప్డ్‌, వ్యత్యాసాల కారణంగా నోటీసులు అందుకున్న ఓటర్లు.. ఇకపై ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ) కార్యాలయానికి వెళ్లి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటీసులు అందుకున్న ఓటర్ల ఇంటికే బీఎల్‌ఓలు వెళ్లి వారి వివరాలు, పత్రాలు సేకరించాలని ఆదేశించారు. సేకరించిన పత్రాలను బీఎల్‌ఓలు ఈసీఐసెట్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే వాటిని ఈఆర్‌ఓ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ (హియరింగ్‌)కు హాజరు కావాల్సి ఉంటుంది. హియరింగ్‌ కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అవకాశం ఉండగా.. వ్యక్తి బదులు కుటుంబ సభ్యులు హాజరు కావొచ్చని పేర్కొంది.

పేర్ల అనువాదంలో తప్పులు

ప్రజలు సర్వే ఫాంలో తమ పేర్లను తెలుగులో స్పష్టంగా రాసిచ్చినప్పటికీ.. పాత రికార్డుల్లోని ఇంగ్లిష్‌ పేర్లను ఆటోమేటిక్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుగులోకి తర్జుమా చేయడం వల్ల తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయి. ఇంటి పేర్లు మారడం, పేర్లలో ఒత్తులు, దీర్ఘాలు ఎగిరిపోవడం (ఉదా: లక్ష్మయ్య అనే పేరులో క్ష, య వత్తు దూరంగా జరగడం) వంటి చిన్నచిన్న తప్పులను కూడా సాఫ్ట్‌వేర్‌ తేడాగా గుర్తించి ఆటోమేటిక్‌గా నోటీసులు జనరేట్‌ చేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన కొత్త భౌతిక డిక్లరేషన్‌ ఫారాల డేటాను పక్కనబెట్టి, పాత ఆటోమేషన్‌ సిస్టంనే వాడటంతో సమస్య మొదటికి వచ్చింది.

సర్టిఫికెట్ల కోసం..

ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు 14 రకాల కార్డుల్లో ఒకటి ఆధారంగా చూపవచ్చని తెలిపింది. అయితే క్షేత్రస్థాయి అధికారులు మాత్రం కులం సర్టిఫికెట్‌ తీసుకురావాలని ఒత్తిడి చేస్తుండటంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

పరిశీలనతో పరిష్కారం..

పాత ఇంగ్లిష్‌– తెలుగు ఆటో– ట్రాన్స్‌లేషన్‌ను నిలిపివేసి.. ఏఐ ఆధారిత వాయిస్‌, తెలుగు టైపింగ్‌ టూల్స్‌ ద్వారా డేటా సరిచేయాలి. ఓటర్లు బీఎల్‌ఓలకు అందించిన భౌతిక డిక్లరేషన్‌ ఫారాల ఆధారంగానే సిస్టంలో మార్పులు చేపట్టాలి. సాఫ్ట్‌వేర్‌ పంపే నోటీసులపైనే ఆధారపడకుండా, నిజమైన దొంగ ఓట్లను అరికట్టేందుకు బీఎల్‌ఓలు, ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయి విచారణ జరిపి సవరణ చేయాలి.

సాఫ్ట్‌వేర్‌ లోపాలు..

సర్‌ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలు, సాఫ్ట్‌వేర్‌ అనువాద పొరపాట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సష్టిస్తున్నాయి. నోటీసులు రావడానికి గతంలో క్షేత్రస్థాయిలో సాఫ్ట్‌వేర్‌ వైఫల్యం వల్లే అనేది బహిరంగ రహస్యం. గ్రామాల్లో ఓటర్లు భౌతిక డిక్లరేషన్‌ ఫారాలను సరిగ్గా నింపి ఇచ్చినప్పటికీ.. సిస్టంలోని ఆటో– ట్రాన్స్‌లేషన్‌ లోపాల కారణంగా వేలాది మందికి నోటీసులు జారీ అవుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సమస్యను పరిష్కరించుకోవడానికి సామాన్యులకు గుర్తింపు కార్డులు చూపడం భారంగా మారింది. గ్రామాల్లో నివసించే చదువుకోని నిరుపేదలు, వృద్ధుల వద్ద ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డులు ఉండకపోవచ్చు. దశాబ్దాలుగా అదే ఊరిలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి కూడా అదనంగా గుర్తింపు కార్డులు తీసుకురావాలని నోటీసులు ఇవ్వడం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

ప్రజల్లో నెలకొన్న సందేహాలనేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం

హియరింగ్‌ కోసం ఓటర్లు ఈఆర్‌ఓ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు

బీఎల్‌ఓలే ఓటర్ల ఇంటికి వచ్చి పత్రాల పరిశీలన, వివరాల సేకరణ

ఆటో– ట్రాన్స్‌లేషన్‌ లోపాల వల్లే వేలాది మందికి నోటీసులు

సర్టిఫికెట్ల కోసం

మీసేవ కేంద్రాలకు పరుగులు

వేగవంతం చేస్తాం..

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం నోటీసుల విచారణ వేగవంతం చేస్తాం. బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి పత్రాలు, వివరాలు సేకరించి ఈసీఐసెట్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే వాటిని ఈఆర్వో పరిశీలించి పరిష్కరిస్తారు. డేటా నమోదులో ఎక్కడ లోపం ఉందో గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారు. అన్‌మ్యాప్డ్‌, తేడాలుండి నోటీసులు అందుకున్న ఓటర్ల పత్రాలు సమర్పించి పరిష్కారం కోసం సహకరించాలి.

– హేమంత కేశవ్‌ పాటిల్‌, కలెక్టర్‌, నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement