భూముల లెక్క పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూముల లెక్క పక్కాగా చేపట్టాలి

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

వనపర్తి: గత పాలకులు తీసుకొచ్చిన ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వేకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.రీసర్వేను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, పూర్తి బాధ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. ముందుగా గ్రామా ల సరిహద్దులను పక్కాగా నిర్ధారించుకుని, ఆ తర్వాత భూముల సర్వేను పక్కాగా చేపట్టాలన్నా రు. సోమవారం వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, గృహనిర్మాణం, భూముల రీసర్వే అంశాలపై నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశానికి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆరా తీశారు. అలాగే రైతుల నుంచి వ్యక్తమవుతున్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి విలేకర్లతో మాట్లాడారు. సుమారు 120 ఏళ్ల క్రితం భూముల సర్వే నిర్వహించారని.. మళ్లీ ఇప్పుడు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రీసర్వే ప్రక్రియను చేపట్టిందన్నారు. తహసీల్దార్‌ స్థాయి నుంచి కలెక్టర్‌ వరకు అధికారులందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ఈ ప్రక్రియను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నా రు. నవంబర్‌ 15వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే విషయంలో అటవీ, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రీసర్వే ప్రక్రియకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా.. రెండో విడతలో మరో 2వేల ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో చేసిన తప్పులు రెండో దశలో పునరావృతం కానివ్వొద్దని అధికారులకు సూచించారు. మూడు, నాలుగో విడతల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. అందరికీ ఇళ్లు ఇచ్చి రాష్ట్రంలో ఏ జనావాస ప్రాంతంలో పూరిగుడిసె లేకుండా చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

పరిష్కార మార్గాలు చూపాలి

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను అధికారులు క్రమబద్ధమైన విధానంలో పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ప్రతి నెలలో ఒక్కో మండలానికి ఒక రోజు కేటాయించి, ఆ మండలానికి సంబంధించిన ప్రజా సమస్యలపై సమీక్షించాలన్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అర్జీల స్వీకరణ కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటుచేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు వారం రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్‌ నియోజకవర్గంలో ప్రతిపాదిత పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్‌ సురభి, రిజ్వాన్‌ బాషా షేక్‌, హేమంత కేశవ్‌ పాటిల్‌, సీహెచ్‌ ప్రియాంక, కార్పొరేషన్‌ చైర్మన్‌ సరిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్‌ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌ హనుమంతు, గృహనిర్మాణశాఖ ఎండీ గౌతమ్‌, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

కలెక్టర్లు, అధికారులు పనితీరు మార్చుకోవాలి: ప్రభుత్వ విప్‌

ప్రజాసమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై ప్రభుత్వ విప్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. కలెక్టర్‌ నుంచి క్లర్క్‌ వరకు అధికారులు అందరూ ప్రజలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండాలని, కలెక్టర్‌ పూర్తిగా పర్యవేక్షణ చేయాలన్నారు. అభివృద్ధికి సంబంధించిన నిధులు మంజూరు చేయించడం, తీసుకురావడం మాత్రమే ఎమ్మెల్యేలుగా మా బాధ్యత అని.. వాటి అమల, పర్యవేక్షణ పూర్తి బాధ్యత కలెక్టర్‌, అధికారులదేనన్నారు. నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్లు ప్రతి నెలా స్థానిక ఎమ్మెల్యేలతో విధిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. రోడ్లు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణాల కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన రైతులకు, బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. అడవి వెంకటాపూర్‌ గ్రామంలో సుమారు 600 ఎకరాల భూ సమస్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉందని తెలిపారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా జాయింట్‌ సర్వే నిర్వహించి ఈ సమస్యను వెంటనే కొలిక్కి తేవాలని డిమాండ్‌ చేశారు.

ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే రీ సర్వే

నవంబర్‌ 15లోగా రీ సర్వే పూర్తి చేయాలి

అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement