బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

● ఎస్‌ఐఆర్‌పై సమగ్ర విచారణ జరపాలి : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌

● ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత ఉండాలి: ప్రభుత్వ విప్‌ యెన్నం

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తోందని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓట్ల తొలగింపు, ఓటర్ల జాబితా రూపకల్పనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. డీసీసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటు హక్కును దెబ్బ తీసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను కాపాడాలని, ఎస్‌ఐఆర్‌పై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో చేసిన మార్పులు రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిపై సందేహాలకు తావిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సంజీవ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం డీఆర్‌ఓ నిర్మలకు వినతిపత్రం సమర్పించింది. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్‌రెడ్డి, అధికార ప్రతినిఽధి హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు వినోద్‌కుమార్‌, సిరాజ్‌ ఖాద్రీ, సత్తూర్‌ చంద్రకుమార్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, పరమేశ్వర్‌, రాములుయాదవ్‌, ఎస్సీ సెల్‌ చైర్మన్‌ రాజు, లింగం నాయక్‌, కార్పొరేటర్లు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement