జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు
● ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
అన్న చందంగా పనులు
● కూరగాయల విక్రయాలకు ఇబ్బందులు
● పట్టింపులేని అధికారులు, పాలకులు
జడ్చర్ల: పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తైతే సాఫీగా వ్యాపారం చేసుకోవచ్చని అనుకున్న కూరగాయల విక్రయదారుల ఆశలు అడియాశలయ్యాయి. సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం 2021లో రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. దీంతో భవన నిర్మాణానికి అధికారులు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న స్థలాన్ని ఖరారు చేయగా.. అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి ఐదేళ్లయినా పునాదులకే పరిమితమయ్యాయి. ప్రస్తుం పిల్లర్లకు ఏర్పాటు చేసిన సీకులు తుప్పుపట్టాయి. పిచ్చిమొక్కలు, ముళ్ల కంపలు పెరిగి అక్కడ ఓ నిర్మాణం ఉన్న సంగతే బయటికి కనిపించని విధంగా ఉంది.
స్థలం కొరత..
సమీకృత మార్కెట్ యార్డు కొనసాగేందుకు కనీసంగా రెండెకరాల స్థలం అవసరం ఉంది. కూరగాయలు, మాంసం, పూలు, పండ్లు, పాలు వంటి దుకాణాలకు వేర్వేరుగా షెడ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొనుగోలుదారుల వాహనాల పార్కింగ్‌కు కూడా స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. కానీ జడ్చర్లలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్‌కు అంత స్థలం అందుబాటులో లేదు. దీంతో అధికారులు మండల పరిషత్, మండల మహిళా సమాఖ్య, ఎమ్మార్సీ, వ్యవసాయశాఖ కార్యాలయాలు కొనసాగుతున్న ప్రాంగణంలో సమీకృత మార్కెట్‌కు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ స్థలంలో కూడా పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాలకు చెందిన భవనాలు ఉండగా.. వాటిని కూల్చి ఆయా స్థలాలను సైతం సమీకృత మార్కెట్‌కు అనుకూలంగా చదును చేసి పనులు చేపట్టారు. అక్కడే ఉన్న కోర్టు భవనాన్ని కూల్చి ఎంపీడీఓ కార్యాలయం ముందు భాగంలో కొత్తగా నిర్మించాలని అప్పట్లో అధికారులు, పాలకులు అభిప్రాయపడినా.. అంతలోనే ప్రభుత్వం మారడంతో దానికి సంబంధించి ప్రతిపాదన మరుగున పడింది.
గాంధీ ట్రస్టు స్థలంలో..
167 జాతీయ రహదారిని అనుసరించి ఖాళీగా ఉన్న గాంధీ ట్రస్టు స్థలంలో సమీకృత మార్కెట్‌యార్డును ఏర్పాటు చేస్తే బాగుంటుందని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు. గాంధీ ట్రస్టు స్థలానికి సంబంధించి తప్పడు రికార్డులు సృష్టించి కొందరు ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దీనిపై దృష్టి సారిస్తే ఆక్రమణ నుంచి గాంధీ ట్రస్టు స్థలాన్ని కాపాడడమే గాక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల సమస్య తీరుతుంది.
పట్టణంలో కూరగాయల క్రయవిక్రయాలకు ప్రస్తుతం రైతులు, చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. చు ట్టుపక్కల గ్రామాల నుంచి కూరగాయలు తీ సుకొచ్చే రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి ని ఎదుర్కొంటున్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు రహదారిని అనుసరించి ప్రస్తుతం క్రయవిక్రయాలు సాగుతున్నాయి. అయితే ఇక్కడ కూడా రోడ్డు దాటుతూ ఓ మహిళా రైతు ప్రమాదంలో మృత్యవాత పడడంతో ప్రధాన రహదారిని సగం వరకు ఖాళీ చేయించారు. అప్పటి నుంచి బాబీ స్ట్రీట్‌లో కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. అయితే ఇక్కడ కూడా దుకాణాల యజమానులు కూరగాయల విక్రయాలకు వచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.


