మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రజారోగ్యంలో ఫార్మసిస్టులదే కీలకపాత్ర అని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు శుకవ్రారం పీయూ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఫార్మసిస్టు డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడిన సందర్భంగా ఫార్మసీ డే నిర్వహించుకోడం గర్హించదగ్గ విషయమని, ఔషధాల రూపకల్పనన, అభివృద్ధి, నాణ్యత, సురక్షత వినియోగంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు, రోగుల మధ్య ఫార్మసిస్టులు వారధిగా పనిచేయాలని, కేవలం మందుల విక్రయాలకే కాకుండా, వాటి వినియోగం, మోతాదు, పలు ముఖ్యమైన ఔషదాలపై జాగ్రత్తలు తప్పకుండా వినియోగదారులకు సూచించాలన్నారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రబియా మాట్లాడుతూ.. దేశంలోని ఫార్మ రంగానికి ఫార్మసిస్టులు వెన్నుముకగా నిలుస్తున్నారని, యాంటి మైక్రోబయాల్ రెసిస్టెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వ్యాసరచన, ఉపన్యాసం, పోస్టర్ ప్రజెంటేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ ఈశ్వర్‌కుమార్, హెచ్‌ఓడీ ప్రభాకర్‌రెడ్డి, రవికాంత్, చిన్నాదేవి, శిలాస్, సోమేశ్వర్, సురేష్, స్వాతి, శారద, సుజాత తదితరులు పాల్గొన్నారు.


