● రెండు తులాల పుస్తెల తాడు, నగదు అపహరణ
అడ్డాకుల: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి రెండు తులాల పుస్తెల తాడు, నగదును అపహరించారు. బాధితుల వివరాల ప్రకారం.. ఆనంద్ గురువారం రాత్రి విధులకు వెళ్లగా, భార్య సుజాత పిల్లలు, అత్త తో కలిసి పక్కింట్లో నిద్రించారు. శు క్రవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడ గా తలుపులు తెరిచి, బీరువాలోని వస్తువులు చిందరవందరగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. బీరువా నుంచి బయటపడేసిన దుస్తుల్లో 30 తులాల వెండి లభించడంతో దాన్ని బాధితులకు అప్పగించారు. అయితే రెండు తులాల పుస్తెల తాడు, కొంత నగదు కనిపించలేదు. మూసాపేట ఎస్‌ఐ వేణు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అడ్డాకుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దొంగల భయంతో పక్కింట్లోకి..
కాలనీలో దొంగలు సంచరిస్తున్నారన్న ప్రచారంతోనే ఆనంద్ కుటుంబం ఆ రాత్రి పక్కింట్లో నిద్రించినట్లు తెలిసింది. సాధారణంగా ఇంట్లోనే నిద్రించే కుటుంబం పక్కింటికి వెళ్లిన రాత్రే చోరీ జరగడం గమనార్హం.


