మూడేళ్లుగా జూలైలోనే..
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. జూరాల ప్రాజెక్టు నుంచి ఇన్‌ఫ్లో ప్రారంభం కావడంతో శుక్రవారం కోయిల్‌సాగర్‌కు నీటిని ఎత్తిపోశారు. జూరాల ఫేజ్–1 పంప్‌హౌస్‌లో రెండు మోటర్లు, తీలేర్ ఫేజ్–2 పంప్‌హౌస్‌లో రెండు పంపులను రన్ చేసి నీటిని కోయిల్‌సాగర్‌కు తరలించారు. ప్రాజెక్టులో నీటిమట్టం ప్రస్తుతం 22 అడుగులకు చేరడంతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. వానాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే వరి నాట్లు వేసుకున్న రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కురిసిన అడపాదడపా వర్షాలతోపాటు బోరుబావుల కింద సాగు చేసిన పంటలకు ఈ నీరు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. కర్ణాటక ప్రభుత్వంతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు జరిపిన చర్చల అనంతరం నారాయణపూర్ డ్యామ్ నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. దీంతో జూరాలకు ఇన్‌ఫ్లో రావడంతో కోయిల్‌సాగర్ లిఫ్ట్ పంపులను నడిపిస్తున్నారు. జూరాల నుంచి ఇన్‌ఫ్లో ఉన్నంతకాలం పంపులను రన్ చేస్తూ కోయిల్‌సాగర్‌కు నీటిని తరలించనున్నారు. మరోవైపు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తూ గొలుసుకట్టు చెరువులు, చెక్‌డ్యామ్‌లను నింపే అవకాశం ఉంది.
వానాకాలం పంటలపై
రైతుల్లో మళ్లీ ఆశలు
రెండు మోటర్లతో ఎత్తిపోత..
కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల
22 అడుగులకు చేరిన ప్రాజెక్టు
నీటిమట్టం
మూడేళ్లుగా కోయిల్‌సాగర్ నుంచి జూలై మూడో వారంలోనే వానాకాలం పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో ప్రాజెక్టులో 20 అడుగులకు పైగా నీటిమట్టం ఉండటంతో సాగునీటి విడుదలకు ఇబ్బందులు ఉండేవి. గతేడాది కూడా వానాకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని అందించడంతోపాటు యాసంగిలో ఆరుతడులుగా నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది మాత్రం వర్షాభావ పరిస్థితులతో కోయిల్‌సాగర్ నీటిమట్టం 9.6 అడుగులకు పడిపోయింది. దీంతో రైతులు ఎత్తిపోతలపైనే ఆశలు పెట్టుకున్నారు. జూరాల నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టు నీటిమట్టాన్ని 22 అడుగులకు చేర్చిన అనంతరం కాలువలకు నీటిని విడుదల చేశారు. కొంతకాలం తర్వాత జూరాల నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో కాలువలను మూసివేయాల్సి వచ్చింది. తాజాగా మళ్లీ ఇన్‌ఫ్లో ప్రారంభం కావడంతో కాలువలను తెరిచారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటితో వానాకాలం పంటలు ఎంతమేర గట్టెక్కుతాయో చూడాల్సి ఉంది.


