● ఏడాది క్రితం తమ్ముడు..
ఇప్పుడు అన్న
● ఇద్దరు కొడుకులనూ కోల్పోయిన
తల్లిదండ్రులు
● మహమ్మదాబాద్ మండలం
దేశాయిపల్లిలో విషాదం
మహమ్మదాబాద్: ఆ తల్లిదండ్రులకు కొడుకులే ఆధారం. ఏడాది క్రితం అనారోగ్యంతో చిన్న కుమారుడిని కోల్పోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు పెద్ద కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో దూరమయ్యాడు. ఇద్దరు కొడుకులనూ కోల్పోయిన ఆ తల్లిదండ్రు ల రోదనతో దేశాయిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన కుర్వ కిష్టయ్య కుమారుడు మల్లేష్ (27) శుక్రవారం ఉదయం బైక్‌పై కొంరెడ్డిపల్లికి బయలుదేరాడు. ఈ క్రమంలో తాండూరు వైపు నుంచి వస్తు న్న ఆర్టీసీ అద్దె బస్సు (టీఎస్06 యూసీ 3213) అతడి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బైక్‌తో పాటు మల్లేష్‌ను బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో రోడ్డంతా తీవ్ర రక్తాస్రావమైంది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.
కుటుంబానికి తీరని లోటు
కిష్టయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మల్లయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు మల్లేష్ కూడా ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య రత్నమాలతోపాటు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వైన్స్‌లో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అందరితో కలుపుగోలుగా ఉండే మల్లేష్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య రత్నమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
మహేష్


