● సేవా సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్త కార్యక్రమం
● మహిళా శక్తిని బలోపేతం చేస్తే
మరింత సేవ: ఎంపీ డీకే అరుణ
నవాబుపేట: విధి నిర్వహణలో సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలిచిన వివిధ శాఖల సిబ్బంది సేవలు ప్రశంసనీయమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం నవాబు పేట మండల కేంద్రంలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళాశక్తిని మ రింత బలోపేతం చేస్తే సమాజానికి మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. ప్రధాని నరేంద్రమో దీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కరోనా సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పిన ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. వారి సేవలకు గుర్తింపుగా గ్రామీణ స్థాయిలో ఆశాలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లను సన్మానిస్తున్నట్లు చెప్పారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. కాగా.. తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన సందర్భంగా ఎంపీ డీకే అరుణను జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పద్మజారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా, మండల కమిటీల నాయకులు ఘనంగా సన్మానించారు.
వినతుల వెల్లువ
నవాబుపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, లైటింగ్, సీసీ రోడ్ల కోసం సర్పంచ్ గీతారాణి, పంచాయతీ సభ్యులు ఎంపీకి వినతిపత్రం అందించారు. జెడ్పీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని ఎంఈఓ నాగ్యనాయక్ కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, డీఎంవీ శ్రీవాణి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ జయరాంనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


