కల్వకుర్తి రూరల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కన్వీనర్ రాఘవాచారి, బెకెం జనార్దన్ లు డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాకు తీవ్ర నష్టం కలిగించే డిండి ప్రాజెక్టును ఆపాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల సాధనకు శనివారం ఉదయం వంగూరు మండలం ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని లయన్స్ క్లబ్ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని కోరారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా పీఆర్‌ఎల్‌ఐకి సాగునీరు అందడం ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మిగిలిన పనులను పూర్తి చేసి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశా రు. కృష్ణానదిపై ఆధారపడిన ఉమ్మడి పాలమూరు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించడమే లక్ష్యంగా గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదన్నారు. ప్రాజెక్టుల పెండింగ్ పనులు, కాలువల నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని, ఎక్కువగా వచ్చే సాగునీటిని ఇవ్వాలని, నాకు నష్టం చేకూర్చే డిండి ప్రాజెక్టును ఆపాలని చేపట్టే పాదయాత్రలో రైతులు, ప్రజలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలని కోరారు. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానందం గౌడ్, రిటైర్డ్ తహసీల్దార్ చెన్న కష్ణయ్య, రైతు జేఏసీ ఉద్యమ నేత రామచంద్రారెడ్డి, జేఏసీ నాయకులు లింగస్వామి, జంగయ్య, అడ్వకేట్ వెంకట్‌గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రేపు ఉల్పర నుంంచి కల్వకుర్తికి
పాదయాత్ర
పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కన్వీనర్ రాఘవాచారి


