అధిక వడ్డీ ఆశ.. రూ.4 కోట్లతో పరారీ | - | Sakshi
Sakshi News home page

అధిక వడ్డీ ఆశ.. రూ.4 కోట్లతో పరారీ

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు

అచ్చంపేట రూరల్‌: అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తి పరారైన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమ డబ్బు లు ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. పట్టణంలోని సాయినగర్‌ కాలనీకి చెందిన ఎండీ సలీం లేబర్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. పరిచయం ఉన్న స్థానికులకు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. తొలినాళ్లలో నెలనెలా వడ్డీ చెల్లించడంతో అతడిపై నమ్మకం పెరిగింది. దీంతో విద్య, వైద్యం, వివాహాలు తదితర అవసరాల కోసం దాచుకున్న సొమ్మును సైతం పలువురు అతడికి ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.

రూ.23 లక్షలు ఇచ్చిన బాధితుడు

సాయినగర్‌ కాలనీకి చెందిన దామెర్ల శేఖర్‌ సలీంకు రూ.23 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి నెలా రూ.లక్షకు రూ.5 వేల చొప్పున వడ్డీ చెల్లిస్తానని చెప్పాడన్నారు. మొదటి మూడు నెలలు సక్రమంగా చెల్లించినా ఆ తర్వాత వాయిదాలు వేస్తూ వచ్చాడని పేర్కొన్నారు. ఈ నెల 23న మొత్తం డబ్బు చెల్లిస్తానని చెప్పి ఆ తర్వాత ఫోన్‌ ఎత్తలేదన్నారు. ఇంటికి వెళ్లి చూడగా ఫోన్‌ అక్కడే వదిలి పరారైనట్లు తెలిసిందని శేఖర్‌ తెలిపారు.

బాధితుల్లో 40 మంది వరకు

ఉన్నట్లు అంచనా

విద్య, వైద్యం, పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్ము ఇచ్చిన బాధితులు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

బాధితుడి ఫిర్యాదుతో సీఐ ఏశమళ్ల నాగరాజు, ఎస్‌ఐ బి.నరేష్‌ సలీం ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న పలువురు బాధితులు అక్కడికి చేరుకుని తమ గోడును పోలీసులకు వివరించారు. సుమారు 40 మంది బాధితులు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. సలీంను త్వరలో పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని సీఐ నాగరాజు పేర్కొన్నారు. అధిక వడ్డీల ఆశతో ప్రైవేట్‌ వ్యక్తులకు డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement