నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా చేయూత పథకం కింద కొన్ని వర్గాలకు కొత్త పింఛన్లు మంజూరు చేయబోతుంది. ఈ నెల 16 వరకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు మాత్రం ఇవ్వడం లేదు. వారిని నిరాశపర్చచకుండా గ్రామ కార్యదర్శులు కేవలం దరఖాస్తులు మాత్రం తీసుకొన్నారు. కానీ, ఎక్కడా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. కేవలం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీతా కార్మికులతోపాటు ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు మాత్రమే కొత్త పింఛన్లు ఇవ్వనుంది. వీరి దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్ చేయడంతో వాటిని ప్రభుత్వం నిబంధనల ప్రకారం విచారణ చేయడానికి మండల స్థాయి అధికారులకు బాధ్యత అప్పగించారు. వారు శుక్రవారం వరకు విచారణ పూర్తి చేసి సంబంధిత ఎంపీడీఓలకు అప్పగించనున్నారు. వాటిని ఎంపీడీఓ ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత జిల్లా అధికారులు పరిశీలించి ఆమోదించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 65,566 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఫైలేరియా, డయాలసిస్ బాధితులను ఇందులో కలపలేదు. అలాగే వృద్ధుల దరఖాస్తులు స్వీకరించి.. ఆన్‌లైన్‌లో నమోదు చేసినా ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
విచారణలో మండల అధికారులు
చేయూత లబ్ధిదారుల దరఖాస్తులను విచారణ చేయడానికి మండల స్థాయిలో ఎంఈఓ, పీఆర్‌ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, ఎంపీఓలకు బాధ్యత అప్పగించారు. దరఖాస్తులు, గ్రామాల సంఖ్యను పరిగణలోకి తీసుకొని విచారణ అధికారులను ఎంపిక చేశారు. వారికి ముందుగానే పింఛను అర్హతకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలో వివరించారు. అంతేకాకుండా నింబంధనలకు సంబంధించిన వివరాలు అందజేశారు. ఒక్కో దరఖాస్తును ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమగ్రంగా విచారణ చేసి అర్హులను ఎంపిక చేయాలని సూచించినట్లు నాగర్‌కర్నూల్ డీఆర్‌డీఓ ఓబులేష్ తెలిపారు.
వృద్ధులకు మొండిచేయి?
జిల్లాలో చాలామంది వృద్ధులు పింఛన్ కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం వారికి మొండిచేయి చూపింది. వీరిలో చాలామంది ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా వారికి రావన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ, తమకు కూడా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుందనే భ్రమలోనే ఉన్నారు.
నిబంధనలు కఠినతరం..
చేయూత పథకం కింద పింఛను మంజూరు కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టింది. గ్రామీణ ప్రాంత లబ్ధిదారుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, 3 ఎకరాలకు మించకుండా తరి భూమి, 7.5 ఎకరాల వరకు నీటి పారుదల లేని భూమి ఉన్నవారు అర్హులు. ఇక లైట్ లేదా హెవీ మోటారు వాహనాలు కలిగిన వారు సైతం పింఛన్‌కు అనర్హులు. పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్నవారి కుటుంబ సభ్యులు కూడా పింఛన్‌కు అనర్హులుగా నిర్ణయించారు.
ప్రభుత్వానిదే నిర్ణయం..
చేయూత పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను శుక్రవారంలోగా విచారణ పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులకు సూచించాం. వీరంతా ఆయా గ్రామాల్లో పర్యటించి రికార్డులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివరాలు క్రోడీకరించి అర్హులను ఎంపిక చేస్తారు. తర్వాత ఎంపీడీఓ లాగిన్‌లో నమోదు చేయగా జిల్లా స్థాయిలో పరిశీలించి ఆమోదిస్తాం. అయితే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
– ఓబులేష్, డీఆర్‌డీఓ, నాగర్‌కర్నూల్
ఉమ్మడి జిల్లాలో 65,566 మంది దరఖాస్తులు
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న మండలస్థాయి అధికారులు
నేటితో ముగియనున్న విచారణ గడువు
ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక
పండుగ కానుకగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు కసరత్తు


