ఉపాధితో పాటు సమగ్రాభివృద్ధికి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

ఉపాధితో పాటు సమగ్రాభివృద్ధికి ప్రణాళిక

Sep 25 2026 1:17 AM | Updated on Sep 25 2026 1:17 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి దోహదపడే పనులను గుర్తించి వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా సూచించారు. గ్రామాల ప్రత్యేక అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, నీటి లభ్యత, వ్యవసాయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అక్టోబర్‌ 2న నిర్వహించే గ్రామసభల్లో ప్రణాళికలను ప్రజల ముందుంచి ఆమోదం పొందిన అనంతరం పనులు చేపట్టాలని తెలిపారు. వీబీజీ రామ్‌జీ పనుల కింద చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సర్పంచులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్టోబర్‌ 1 నుంచి 2027 జూన్‌ వరకు చేపట్టే పనులతో పాటు తదుపరి మూడేళ్లకు అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల వారీ ప్రణాళికలను ఈ నెల 30లోగా సమర్పించాలలని ఆమె సూచించారు.

నీటి భద్రతకు ప్రాధాన్యం..

వర్షపాతం అస్థిరత, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలపై ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌లు, పామ్‌పాండ్లు, పర్కొలేషన్‌ ట్యాంకులు, రీచార్జ్‌ నిర్మాణాలు, రీచార్జ్‌ బోర్‌వెల్లు, సోక్‌పిట్లను అవసరమైన ప్రాంతాల్లో చేపట్టాలన్నారు. వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యం పెంచడం, పంటల వైవిద్యీకరణ, ఉద్యాన పంటలు, పశుపోషణను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నీటి సంరక్షణ, మౌలిక వసతులు, జీవనోపాధి అభివృద్ధి, వర్షాభావ పరిస్థితుల నివారణకు ప్రణాళికల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీలు, ప్రహరీలు, డ్రెయినేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల వంటి అవసరాలను గుర్తించి చేర్చాలని తెలిపారు. అధిక వర్షాల సమయంలో వరదలు, డ్రెయినేజీ సమస్యలు తలెత్తకుండా కాల్వలు, చెరువులు, కుంటలు, ఫీల్డ్‌ ఛానళ్ల అభివృద్ధి పనులను ముందుగానే గుర్తించాలన్నారు.

డేటా ఆధారంగా ప్రణాళికలు

జీపీడీపీ, జీసాప్‌ తదితర ప్రణాళికల్లో ఇప్పటికే గుర్తించిన పనులను వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికతో అనుసంధానం చేయాలని కలెక్టర్‌ సూచించారు. బేస్‌లైన్‌ డేటా, సోషల్‌ మ్యాపింగ్‌, రిసోర్స్‌ మ్యాపింగ్‌ నిర్వహించి గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, చెరువులు, కుంటలు, కాలువలు, ఎత్తైన, లోతట్టు ప్రాంతాలను మ్యాప్‌లో గుర్తించాలన్నారు. ప్రణాళికలు కేవలం అధికారిక ప్రక్రియగా కాకుండా వాస్తవ అవసరాలకు అనుగుణంగా, కొలిచే ఫలితాలు వచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. మంచి పనితీరు కనబరిచే గ్రామ పంచాయతీలను గుర్తించి ప్రోత్సహిస్తామని, ఉత్తమ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరిస్తామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ పి.మధుసూదన్‌ నాయక్‌, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములుగౌడ్‌, అధికారులు, పాల్గొన్నారు.

నీటి సంరక్షణకు పెద్దపీట

గ్రామాల వారీగా ఈ నెల 30లోగా ప్రణాళిక సమర్పించాలి

అక్టోబర్‌ 2న గ్రామసభల్లో ఆమోదం: కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement