మహబూబ్‌నగర్ (వ్యవసాయం): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వాతావరణం మారింది. మూడు రోజులుగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ఎండవేడిమి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వానాకాలం ముగింపు దశలో కురుస్తున్న వర్షాలు సాగులో ఉన్న పంటలకు కాస్త ఊరటనిచ్చాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటలకు జిల్లాలో అత్యధికంగా మూసాపేట మండలంలో 56.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూత్పూర్‌లో 38.0 మి.మీ., మహమ్మదాబాద్‌లో 36.5, కోయిలకొండలో 33.9, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 36.2, హన్వాడలో 31.7, మహబూబ్‌నగర్ రూరల్‌లో 29.3, దేవరకద్రలో 20.8, అడ్డాకులలో 20.5, కౌకుంట్లలో 18.5, గండేడ్‌లో 16.0, చిన్నచింతకుంటలో 16.6, బాలానగర్‌లో 12.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎస్టీ గురుకులాల్లో
ఇంటర్ సీట్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 9 ఎస్టీ గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 26 లోగా సంబంధిత గురుకులాల్లో దరఖాస్తులు చేసుకోవాలని, కోఆర్డినేటర్ కల్యాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అన్ని సర్టిఫికెట్‌లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆ 81 మంది టీచర్లు విధుల్లో చేరాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కొత్తగా కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరని 81 మంది ఉపాధ్యాయులు వెంటనే బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి.మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. గురువారం ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, విధుల్లో చేరని ఉపాధ్యాయులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్తగా పోస్టింగ్ పొందిన స్థానాల్లో చేరని ఉపాధ్యాయులను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే రిలీవ్ చేయాలని సూచించారు. అనంతరం వారు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిలీవింగ్, జాయినింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. కొత్తగా కేటాయించిన పాఠశాలల్లో ఉపాధ్యాయులు వెంటనే విధుల్లో చేరేలా ఎంఈఓలు, హెచ్‌ఎంలు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.


