● రెడ్‌క్రాస్ ఎన్నికల్లో 19 మంది నామినేషన్లు
● నేడు పరిశీలన.. 26న ఉపసంహరణ
పాలమూరు: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పలువురు ప్రముఖులు పోటీ పడుతుండటంతో ఆసక్తి నెలకొంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఎన్నికల విధానంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటుండటంతో పలువురు పోటీకి ముందుకొచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి డి.కృష్ణ, సహాయ ఎన్నికల అధికారి కె.వీరభద్రయ్య ఆధ్వర్యంలో గురువారం నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. మొత్తం 15 కార్యవర్గ స్థానాలకు 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 26న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నలుగురు అభ్యర్థులు తప్పుకుంటే మిగిలిన 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. లేకపోతే అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నారు. గురువారం నామినేషన్ల ప్రక్రియను అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోటీలో ప్రముఖులు
నగరానికి చెందిన పలువురు ప్రముఖులు డాక్టర్ శ్యామూల్, జేపీఎన్‌సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, నిర్మల్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడు తిరుపతిరెడ్డి, బాబుల్‌రెడ్డి, డాక్టర్ విష్ణు జనార్దన్, జగపతిరావు, రమణయ్య, న్యాయవా ది పుట్టపాగ రఘుపతి, గుండా మనోహర్, ఆర్.రామకృష్ణ తదితరులు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఈ పదవికి ప్రధానంగా ముగ్గురు పోటీ పడుతున్నట్లు తెలుస్తుండటంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.


