ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరుస్తాం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరుస్తాం

Sep 25 2026 1:17 AM | Updated on Sep 25 2026 1:17 AM

● తెలంగాణ ఉద్యమ సమయంలోని కేసుల ఎత్తివేతకు కృషి

● ఎమ్మెల్సీ కోదండరాం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అన్నారు. గురువారం పీయూ లో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుమారు 2వేల కేసులు ఉద్యమకారులపై నమోదు కాగా.. గత ప్రభుత్వం కొన్నింటిని తొల గించిందన్నారు. ఇంకా సుమారు 1200 కేసులు ఉన్నాయని.. వాటిని ఎత్తివేయాలని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించామన్నారు. సీఎం కూడా కేసుల ఎత్తివేతపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కేసులతో చాలా మంది ఉద్యమకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొందరికి ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారన్నారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారుల త్యాగాలు మరువలేనివన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.

మరో వర్గం నిరసన..

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనంలో మరో వర్గం ఉద్యమకారులు నిరసన తెలిపారు. వారు సభ వద్దకు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. సమ్మేళనంలో పాల్గొన్న వారు 2009, 2010 కంటే ముందు ఉద్యమాలు చేశారని.. తాము 2010 నుంచి 2014 వరకు ఉధృతంగా సాగిన ఉద్యమంలో పాల్గొన్నామని.. తమ ప్రమేయం లేకుండా సమ్మేళనం నిర్వహించడం తమను అవమానించడమేనని అన్నారు. తమపై కేసులు ఉన్నాయని, నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని కోరారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం సందర్భంగా పీయూ ఆవరణలో ఎమ్మెల్సీ కోదండరాం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీయూ ఇప్పటికే పచ్చదనంతో కళకళలాడుతుందన్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో వీసీ శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ రమేశ్‌బాబు, కంట్రోలర్‌ ప్రవీణ ప్రిన్సిపల్‌ మధుసూదన్‌రెడ్డి, రాములునాయక్‌, ఈశ్వర్‌కుమార్‌, రవికుమార్‌, అర్జున్‌కుమార్‌, జ్ఞానేశ్వర్‌, చిన్నాదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement