భవనంపై నుంచి పడి యువతి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి యువతి దుర్మరణం

Sep 25 2026 1:17 AM | Updated on Sep 25 2026 1:17 AM

జడ్చర్ల: స్థానిక తాలూకా క్లబ్‌ ఏరియాలో ఓ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువతి దుర్మరణం చెందిన ఘటన గురువారం చో టు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. జడ్చర్ల మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ పాలాది సారిక రామ్మోహన్‌ కూతురు హైందవి (24) బాల్యం నుంచే అనారోగ్యంతో బాధపడుతుంది. ఎప్పటిలాగే తాముంటున్న నివాస భవనంపైకి వెళ్లిన ఆమెకు ఆకస్మికంగా ఫిట్స్‌ రావడంతో పై నుంచి జారీ కింద పడింది. గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు ఆస్పత్రికి వెళ్లి యువతి తల్లిదండ్రులను పరామర్శించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం

అడ్డాకుల: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మూసాపేట మండలం జానంపేటలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. జానంపేటకు చెందిన మౌనిక (40), రాజ్‌గోపాల్‌ భార్యభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజ్‌గోపాల్‌ కిరాణా డబ్బా నడిపిస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఉండగా.. బుధవారం రాత్రి మరోసారి ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన భర్త రాజ్‌గోపాల్‌.. తన ద్విచక్ర వాహనం, ఫోన్‌ ఇంట్లోనే పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన భార్య మౌనిక.. ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మౌనిక ఆత్మహత్యతో గ్రామంలో విషాదం అలుముకుంది.

తండ్రిని హత్య చేసిన కుమారులకు రిమాండ్‌

మక్తల్‌: కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన కుమారులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు మక్తల్‌ సీఐ రాంలాల్‌ గురువారం తెలిపారు. మండలంలోని తిర్మలాపూర్‌లో ఈనెల 21న తండ్రి కొలుపూర్‌ రాములు కుమారులు కృష్ణ, వెంకట్రాములుకు మధ్య గొడవ జరిగింది. గొడవలో తండ్రిని కుమారులు ఇద్దరు కలిసి కారం చల్లి ఇనుప పలుగుతో తలపై దాడి చేయడంతో ఆయన మరణించాడు. ఈ క్రమంలో మృతుడి సోదరుడు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని జూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో నిందితులను హాజరు పరచగా న్యాయమూర్తి ఇద్దరికి రిమాండ్‌ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement