జడ్చర్ల టౌన్: పట్టణంలోని డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి నాగభూషణం ఆధ్వర్యంలో పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ, సముద్ర సంపదకు సంబంధించిన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.సుకన్య మాట్లాడుతూ.. పురాతన నాణేలు, చారిత్రక వస్తువుల ప్రదర్శన విద్యార్థుల్లో చారిత్రక అవగాహన, జ్ఞానాన్ని పెంపొందిస్తాయన్నారు. చరిత్ర అధ్యాపకుడు రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రదర్శనలో మౌర్యులు, గుప్తులు, మొఘలులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తానులు, నిజాం పాలకులు, బరోడా, మైసూరు, మరాఠా రాజ్యాలకు సంబంధించిన నాణేలతో పాటు గ్రీకు తదిరత ప్రాంతాలకు చెందిన పురాతన నాణేలు, కరెన్సీ 500 పైగా ప్రదర్శించినట్లు తెలిపారు. అలాగే సముద్ర గవ్వలు, వివిధ రకాల శంఖాలు, ఆల్చిప్పలు, ముత్యపు చిప్పలు, నత్తగుల్లలు, కోరల్స్, స్టార్‌ఫిష్, పగడాలు, గోమతి చక్రాలు, విష్ణుచక్రపు రాళ్లు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాలమూరు పరీక్షల నియంత్రణ అధికారి ప్రవీణ, కంట్రోలర్ ప్రవీణ్‌కుమార్, అధ్యాపకులు డా.సులేమాన్, డా.సదాశివయ్య, నాగలక్ష్మి, ఆంజనేయులు, పుష్పలత, వెంకటయ్య, నాగరాజు, నందకిషోర్, నర్సింహ, రవీందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


