కందనూలు: సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దీంతో పంటలకు సాగునీరు అందడం లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు వల్లే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వల సామర్థ్యం కుదించడంతోనే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని విమర్శించారు. తొమ్మిది మీటర్లు ఉండవలసిన కాల్వల వెడల్పును ఏడు మీటర్లకు కుదించారని వాపోయారు. నార్లాపూర్ ఏదుల రిజర్వాయర్లలో నాలుగు మోటర్లు పనిచేయవలసి ఉండగా రెండు మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయని దీంతో రిజర్వాయర్లు నిండడం లేదన్నారు. ఎనిమిది గంటలు విద్యుత్ సరఫరా ఆయకట్టుకు సాగునీరు ఎలా అందుతుందని ప్రశ్నించారు. రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం బదులు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు బాలాగౌడ్, అర్థంరవి, లక్ష్మయ్య, అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.


