మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్లుగా పేరుకుపోతున్న చెత్తకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అడుగులు పడుతున్నాయి. కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు గుట్టపై ఉన్న ప్రస్తుత డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయంగా బండమీదిపల్లి సమీపంలో కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 38 ఎకరాల ప్రభుత్వ భూమిని కార్పొరేషన్‌కు బదిలీ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఇప్పటికే స్థలాన్ని సర్వే చేశారు.
జీరో వేస్టేజ్ విధానంలో..
బండమీదిపల్లి పరిధిలోని బాగ్మార్‌సాబ్ దర్గా సమీపంలోని సర్వే నంబర్ 812లో కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ జీరో వేస్టేజ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. తడి చెత్త నుంచి గ్యాస్, పొడి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్‌ను రూపొందించనున్నారు. ఇందుకోసం అవసరమైన యంత్రాలు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలో చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. రోజూ వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు శుద్ధి చేసి పునర్వినియోగించడంతో చెత్త గుట్టలు పేరుకుపోకుండా చూడనున్నారు. ప్రస్తుతం కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు గుట్టపై ఉన్న డంపింగ్ యార్డుకు 60 డివిజన్ల నుంచి రోజుకు సుమారు 106 మెట్రిక్ టన్నుల చెత్త తరలిస్తున్నారు. దీంతో భారీగా చెత్త పేరుకుపోయి పరిసర కాలనీల ప్రజలు దుర్గంధం, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల స్థానికులు డంపింగ్ యార్డు తరలించాలని నిరసన వ్యక్తం చేయగా.. డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.
30న స్టేక్‌హోల్డర్స్ భేటీ
కొత్త డంపింగ్ యార్డు ఏర్పాటుపై ఈనెల 30న కార్పొరేషన్‌లో స్టేక్‌హోల్డర్స్ సమావేశం నిర్వహించనున్నారు. 60 డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొనే ఈ సమావేశంలో ప్లాంట్‌లో ఏర్పాటు చేయనున్న యంత్రాలు, చెత్త శుద్ధి, పునర్వినియోగ ప్రక్రియపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
పుణే, నోయిడాకు..
జీరో వేస్టేజ్ విధానంపై అవగాహన కోసం మహారాష్ట్రలోని పుణే, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కార్పొరేషన్లలో అమలవుతున్న విధానాలను పరిశీలించేందుకు కార్పొరేటర్లను పంపించాలని నిర్ణయించారు. తొలుత 60 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లాలని చర్చ జరిగినా.. పలు కారణాలతో ప్రతి పార్టీ నుంచి ఇద్దరి చొప్పున ప్రతినిధులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
బండమీదిపల్లిలో 38 ఎకరాల్లో కొత్త ప్లాంట్
జీరో వేస్టేజ్ విధానంలో ఏర్పాటుకు చర్యలు
తడి చెత్తతో గ్యాస్.. పొడిచెత్తతో విద్యుత్
ఈనెల 30న స్టేక్‌హోల్డర్స్ సమావేశం


