కరువు నదుల్లో కాదు.. కాంగ్రెస్‌లో ఉంది | - | Sakshi
Sakshi News home page

కరువు నదుల్లో కాదు.. కాంగ్రెస్‌లో ఉంది

Sep 24 2026 2:12 AM | Updated on Sep 24 2026 2:12 AM

● మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ టి.హరీశ్‌రావు

కందనూలు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి ఐదేళ్లలో రూ.4 వేల కోట్లు వెచ్చించి 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌ ప్రభుత్వం చేతగానితనం వల్ల కృష్ణా జలాలను చంద్రబాబు పెన్నా బేసిన్‌కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. కరువు గోదావరి, కృష్ణా నదుల్లో లేదని.. కాంగ్రెస్‌లో ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్ల లో కొత్తగా చేసిందేమీ లేదని, కనీసం 2 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేదని విమర్శించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, కేఎల్‌ఐ ఆయకట్టులో గతంలో కేవలం 26 వేల ఎకరాలు మాత్రమే సాగులో ఉండేవని, బీఆర్‌ఎస్‌ హయాంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చామని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టామని, నార్లాపూర్‌, ఏదుల, కర్వెన, వట్టెం రిజర్వాయర్లను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించామని చెప్పారు. 2023 సెప్టెంబర్‌ 16న కేసీఆర్‌ బాహుబలి మోటార్‌ను ప్రారంభించగా, నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీరు చేరిందని గుర్తుచేశారు. ప్యాకేజీ–3 కెనాల్‌లో 1.33 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని ఉండగా.. బీఆర్‌ఎస్‌ హయాంలో కోటి క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయిందన్నారు. మిగిలిన 33 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిని పూర్తి చేయకపోవడంతో 50 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. శ్రీశైలం నుంచి 88 టీఎంసీలు ఎత్తిపోశామని అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిందని, వాస్తవంగా ఎత్తిపోసింది 8.8 టీఎంసీలు మాత్రమేనని పేర్కొన్నారు. ఎక్కడ ఎత్తిపోశారు.. ఎక్కడ నీరు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలంలో ఇప్పటికీ 56 టీఎంసీలను ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

హర్షవర్దన్‌రెడ్డిని పరామర్శించిన హరీశ్‌రావు

కొల్లాపూర్‌: పితృవియోగంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. బుధవారం సింగోటలోని హర్షవర్దన్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి సానుభూతి తెలిపారు. ఆయన తండ్రి భీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హర్షవర్దన్‌రెడ్డిని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement