బీరం హర్షవర్ధన్‌రెడ్డి పితృవియోగం | - | Sakshi
Sakshi News home page

బీరం హర్షవర్ధన్‌రెడ్డి పితృవియోగం

Sep 19 2026 12:58 AM | Updated on Sep 19 2026 12:58 AM

అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రి లక్ష్మారెడ్డి

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా గుర్తింపు

పరామర్శించిన మంత్రి జూపల్లి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు

పాడెమోసిన అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

కొల్లాపూర్‌: కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బీరం లక్ష్మారెడ్డి(79) గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్ష్మారెడ్డికి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఇద్దరు కుమార్తెలు. లక్ష్మారెడ్డికి సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన సింగోటం గ్రామానికి రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మాచినేనిపల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా పేరుంది. 1983లో కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి పేరును ఎన్టీఆర్‌ ఖరారు చేశారు. అయితే పలు కారణాలతో పోటీ చేయలేకపోయారు. తాను ఎమ్మెల్యే కాలేకపోయానని, తన కుమారుడినైనా ఎమ్మెల్యేగా చూడాలని ఆయన పరితపించేవారు. హర్షవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో లక్ష్మారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు.

స్వగ్రామంలో అంత్యక్రియలు

హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన లక్ష్మారెడ్డి మృతదేహాన్ని శుక్రవారం ఉదయం కొల్లాపూర్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాక ఊరేగింపుగా ఆయన మృతదేహాన్ని సింగోటం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా గ్రామంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించాక ఆయన సొంతతోటలో దహన సంస్కారాలు చేశారు. హర్షవర్ధన్‌రెడ్డి తలకొరివి పెట్టారు. అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు పాడెను మోశారు.

నేతల పరామార్శ

లక్ష్మారెడ్డి మృతదేహానికి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే బీరంను పరామర్శించారు. అదేవిధంగా రంగినేని అభిలాష్‌ రావు, వాల్యానాయక్‌, శ్రీనివాస్‌యాదవ్‌, విజయ్‌, ఆంజనేయులుగౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌.పగిడాల శ్రీనివాసరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్‌, సీపీఎం నాయకులు జబ్బార్‌,శివవర్మ, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌యాదవ్‌, కేతూరి నారాయణ తోపాటు పలువురు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.

నేడు సింగోటంకు కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం సింగోటం రానున్నారు. కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి అంత్యక్రియలకు శుక్రవారం కేటీఆర్‌ రావాలని భావించారు. హైదరాబాద్‌లో ఓ కోర్టు కేసు కారణంగా హాజరుకాలేకపోయారు. శనివారం హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు వస్తారని నాయకులు వెల్లడించారు.

లక్ష్మారెడ్డి (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement