నాగర్‌కర్నూల్: మావోయిస్టుల ప్రభావంతో ఒకప్పుడు నిత్యం అలజడిగా ఉండే నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ ఆయుధాల వ్యవహారం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి అపహరణ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఆర్మీ జవాన్ రాజు అలియాస్ మల్లేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు, దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. . కాగా..ఇళ్లలోనే దాచి ఉంచిన ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకుని మల్లేశ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఉడిమిళ్లతో అనుబంధం
రాజు స్వస్థలం నల్లమలలోని ఉడిమిళ్ల గ్రామం. కొన్నేళ్ల క్రితం అతని కుటుంబం అక్కడి నుంచి మున్ననూరుకు, అనంతరం అచ్చంపేటకు వచ్చి స్థిరపడినట్లు స్థానికులు చెబుతున్నారు. అచ్చంపేటలో రాజు సొంత ఇల్లు నిర్మించుకున్నాడు. ఆయన తండ్రి నారాయణ వసతిగృహాల్లో పనిచేసేవాడని సమాచారం. రాజుకు నాగర్‌కర్నూల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన అనూషతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ పట్టణంలో కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిసింది.
గడ్డివాములో ఆయుధాలు..
పోలీసులు గురువారం సాయంత్రం రాజును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయనకు ఫోన్ చేసి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. అనంతరం రాజును అచ్చంపేటకు తీసుకెళ్లి అక్కడ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇంటి సమీపంలోని గడ్డివాములో ఆయుధాలు దాచినట్లు చెప్పడంతో అక్కడ తనిఖీలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అపహరించిన ఆయుధాలను తొలుత అచ్చంపేటలో దాచిన అనంతరం ఉడిమిళ్లలోని పాత ఇంటికి తరలించి, మళ్లీ అచ్చంపేటకు తీసుకొచ్చి గడ్డివాములో ఉంచినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. రాజును అదుపులోకి తీసుకునే ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు ఉడిమిళ్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
అచ్చంపేటలో ఆర్మీజవాన్ మల్లేష్ ఇల్లు
బొల్లారం ఆయుధాల అపహరణ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా వాసి
ఉడిమిళ్లకు చెందిన ఆర్మీ జవాన్ రాజు అలియాస్ మల్లేష్‌గా గుర్తింపు
అచ్చంపేట ఇంటి సమీపంలో గడ్డివాములో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మూడు ప్రాంతాల్లో కలకలం
రాజు పేరు ఆయుధాల అపహరణ కేసులో వెలుగులోకి రావడంతో ఉడిమిళ్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌తో పాటు ఆయన అత్తగారి గ్రామమైన సిరిపురంలోనూ చర్చనీయాంశమైంది. అచ్చంపేటలోని రాజు ఇంటికి తాళం వేసి ఉండగా.. అద్దెకు ఉంటున్న వారు తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి వద్ద పనిచేసే వారు కూడా గురువారం సాయంత్రం నుంచి రావడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు


