బతుకుదెరువు కోసం వలస.. పసిపాప బలి | - | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసం వలస.. పసిపాప బలి

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

మదనాపురం: బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లిన ఆ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. ఇంట్లో జరిగిన ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి జూలీ మృతిచెందడంతో స్వగ్రామమైన దుప్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రాము, సుధ దంపతులకు ముగ్గురు పిల్లలు. గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఏడాది క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. రాము హిటాచీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. సుధ పిల్లల సంరక్షణ చూసుకుంటోంది. గురువారం రాత్రి ఇంట్లో స్నానానికి నీటిని వేడి చేస్తుండగా.. ఆగుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఐదేళ్ల జూలీ వేడినీటి బకెట్‌లో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు దుప్పల్లికి చేరుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు బంధువులను, గ్రామస్థులను కలచివేశాయి. బతుకుదెరువు కోసం ఊరు విడిచిన ఆ కుటుంబానికి.. చివరికి పసిపాపను కోల్పోయిన కడుపుకోత మిగిలింది.

వేడి నీళ్ల బకెట్‌లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి

దుప్పల్లిలో మిన్నంటిన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement