బెట్టింగ్‌ ఉచ్చులో యువకుడి బలి | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ ఉచ్చులో యువకుడి బలి

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

ఆర్థికంగా నష్టపోయి..

అప్పులు తీర్చలేక ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ క్రైం: క్రికెట్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్‌లో ఆర్థికంగా నష్టపోయి.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన నగరానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్‌ సీఐ ఇజాజుద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని సంజయ్‌నగర్‌కు చెందిన ఎండీ అజారుద్దీన్‌ (27) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న అతడు ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో అప్పులు పెరిగిపోవడంతో పాటు బెట్టింగ్‌లో డబ్బులు రావాల్సిన వారు ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అజారుద్దీన్‌ ఈనెల 9న రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బుర్రానుద్దీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇజాజుద్దీన్‌ తెలిపారు.

పాముకాటుతో కార్మికుడు మృతి

ఊట్కూర్‌: మండలంలోని పగిడిమారిలో శుక్రవారం పాముకాటుతో బాలరాజు (36) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. బాలరాజు ఉదయం పనికి వెళ్తుండగా మార్గమధ్యలో పాము కాటు వేయడంతో అపస్మారక స్థితిలో కిందపడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కిష్టమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

రైలు ఢీకొని దుర్మరణం

దేవరకద్ర: రైలు ఢీకొనడంతో గుర్తు తెలియయని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. కౌకుంట్ల–కురుమూర్తి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకోవాలని పట్టాలపైకి వెళ్లాడా లేదా అకస్మాత్తుగా రైలు రావడంతో ఘటన జరిగిందో తెలియరాలేదు. మృతుడు బూడిద కలర్‌ జీన్స్‌ప్యాంటు వేసుకుని షర్టు లేకుండా ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. చామన ఛాయ ముఖం, గుండ్రటి మొహం కలిగి ఉన్నాడని, వయసు 35 నుంచి 40 మధ్య ఉండొచ్చన్నారు. ఎవరికై న వివరాలు తెలిస్తే మహబూబ్‌నగర్‌ రైల్వే ఎస్‌ఐకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

చారకొండ: మండలంలోని జూపల్లిలో శుక్రవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలోని జనావాసాల్లో చొరబడి మంతోజు జయమ్మ, అక్కి కృష్ణయ్య ,విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ శేఖర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. జయమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం స్థానికులు పిచ్చికుక్కను చంపేశారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement