● మార్మోగిన గోవింద నామస్మరణ
● అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు
స్వామి దర్శనానికి క్యూలైన్‌లో నిల్చున్న భక్తులు
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా పేరుగాంచిన అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయానికి శ్రావణమాసం అమావాస్యను పురష్కరించుకొని శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చున్నారు. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన స్వామివారితో పాటు అలివేలు మంగమ్మ, చెన్నేకేశవస్వామి, ఆంజనేయస్వామి ఉద్దాల మండపం, స్వామివారి పాదుకలను దర్శించుకొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ భత్తుల బాల్‌రాజు, కమిటీ సభ్యులు అర్జున్ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అర్చకులు, ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


