● పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి
● వరికి పోషక లోపాలు..
కందిలో ఎదుగుదల మందగింపు
● నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రొఫసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.కల్యాణి, డాక్టర్ జి.మాధురి శుక్రవారం చిన్నచింతకుంట మండలంలోని నెల్లికొండి, వడ్డేమాన్, ఎదులాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వరి, పత్తి, కంది, మిరప, చెరకు, ఆయిల్‌పామ్ పంటలను పరిశీలించి.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు.
పత్తిలో పురుగుల ఉధృతి
అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగినట్లు గుర్తించారు. తామర పురుగు, పచ్చదోమ నివారణకు ఫ్లోనికామిడ్ 0.3 మి.లీ. మీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలని సూచించారు.
వరిలో ఎర్ర ఆకులు
వర్షాభావం, చౌడు ప్రభావంతో వరి ఆకులు ఎర్రబడటం వంటి పోషక లోపాలను గుర్తించారు. పంట పరిస్థితిని బట్టి తగిన పోషక యాజమాన్యం పాటించాలని సూచించారు.
కంది ‘ట్రిపుల్–19’
ఎదుగుదల మందగించిన కంది పొలాల్లో 19 :19:19 (టిపుల్–19) లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని తెలిపారు. మిరపలో తామర పురుగు నివారణకు పంట పరిస్థితిని బట్టి ఫిప్రోనిల్–2 మి.లీ. లేదా థయోమెథాకామ్స్ 0.5 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందన్నారు.
మిరపలో తామర పురుగు
మిరపలో తామర పురుగుల ఉధృతి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. నివారణకు పంట పరిస్థితిని బట్టి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా థయోమెథాక్సామ్ 0.5 గ్రాములను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
నీటి పొదుపే కీలకం
అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని వివరించారు. డ్రిప్, తుంపర సేద్య పద్ధతులను అవలంబించాలని, పంట అవశేషాలను వరుసల మధ్య పరచి నేలలో తేమను కాపాడుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో బెట్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫార్మ్ పాండ్లు, నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


