నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్‌ నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నగరానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రూ.603 కోట్లతో చేపట్టనున్న యూజీడీ వ్యవస్థ పనులకు బుధవారం(నేడు) తొలివిడతగా 9 డివిజన్లలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. విడతల వారీగా అన్ని ప్రాంతాల్లో పనులు చేపట్టి మూడేళ్లలో యూజీడీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మురుగునీటి శుద్ధి కోసం రూ.276 కోట్లతో మూడు ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాలకొండ చెరువు వద్ద పనులు కొనసాగుతున్నాయని, పెద్దచెరువు, భూత్పూర్‌ మార్గంలోని రాజీవ్‌ స్వగృహ వెనుక మరో రెండుప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. తాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.220 కోట్లతో 14 ఓహెచ్‌ఆర్‌ఎస్‌లు, పైపులైన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 11 చోట్ల ట్యాంకుల పనులు ప్రారంభమయ్యాయని, మిగతా మూడు చోట్ల త్వరలో చేపడతామన్నారు. ప్రస్తుతం ఉన్న 20 ఎంఎల్‌డీ సామర్థ్యానికి అదనంగా 18 ఎంఎల్‌డీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తామని వివరించారు. ట్రిపుల్‌ ఐటీ కళాశాల భవనానికి మొదటి విడతగా రూ.200 కోట్లతో నెల రోజుల్లో శంకుస్థాపన చేయిస్తామని, ముడా నిధులు రూ.1.50 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మౌలిక వసతులతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించినప్పుడే నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ జి.మమత, డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ఎస్‌.వినోద్‌కుమార్‌, సిరాజ్‌ఖాద్రీ, సీజే బెన్‌హర్‌, మహేందర్‌, యాదిరెడ్డి, అబ్దుల్‌ హక్‌, గోవింద్‌ యాదవ్‌, దాసరి రఘు పాల్గొన్నారు.

రూ.603 కోట్లతో యూజీడీ పనులు.. నేడు 9 డివిజన్లలో శ్రీకారం

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement