జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో హాస్టల్ సంక్షేమ అధికారులు, గురుకులాల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాలు, పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి చెత్త, పిచ్చిమొక్కలు, పొదలు తొలగించాలని, పాములు, విషపురుగులు సంచరించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలు అందించాలని, నెలకోసారి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీల్లో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఉన్నారని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అధికారులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేందుకు వారానికోసారి మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్లిప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్లతో పాటు ఆంగ్ల భాషపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధి సంస్థ అధికారి సునీత, బీసీ సంక్షేమ అభివృద్ధి సంస్థ అధికారి విష్ణు నందన్, జీసీడీఓ ఆశ్ర ఖాద్రి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


