మహమ్మదాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందిన ఘటన మహమ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన రుకుంపల్లి కిష్టయ్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ దగ్గరికి వెళ్లారు. అంతలోని ఆర్‌ఎంపీ కుమారుడు ఎంబీబీఎస్ డాక్టర్, గాదిరాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నిఖిల్‌రెడ్డి బాధితుడికి ఇంజక్షన్, మాత్రలు ఇచ్చాడు. అవి తీసుకొని కిష్టయ్య ఇంటికి వెళ్లే లోపు నురగలు కక్కుతూ అప్పటికప్పుడే మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీ, ఆయన కుమారుడు డాక్టర్ నిఖిల్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆందోళన చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుడు ఆర్‌ఎంపీ క్లినిక్‌లో ఎలా పనిచేస్తారని ప్రశ్నించడంతో పలువురు నాయకులు కల్పించుకొని వారిని సముదాయించారు. కాగా ఆర్‌ఎంపీల వైద్యం తీరుపై ఆయా గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.


